ఏపీ హైకోర్టు తీర్పు క్రూరమైన చర్య.. బిడ్డకు రెండో భర్త ఇంటి పేరు పెట్టొచ్చు: సుప్రీంకోర్టు

Mother’s right to select surname of child after husband’s death.. Supreme Court. తల్లి తన బిడ్డకు రెండో భర్త ఇంటిపేరు పెట్టడం అసాధారణం కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

By అంజి  Published on  29 July 2022 6:00 AM GMT
ఏపీ హైకోర్టు తీర్పు క్రూరమైన చర్య.. బిడ్డకు రెండో భర్త ఇంటి పేరు పెట్టొచ్చు: సుప్రీంకోర్టు

తల్లి తన బిడ్డకు రెండో భర్త ఇంటిపేరు పెట్టడం అసాధారణం కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొదటి భర్త మరణించిన తర్వాత.. అతని ద్వారా అప్పటికే పుట్టిన బిడ్డకు భార్య రెండో భర్త ఇంటి పేరును పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. దీని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ గురువారం జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిల ధర్మాసనం తీర్పు చెప్పింది.

వివరాల్లోకివెళ్తే.. 2003లో లలిత అనే మహిళ కొండా బాలాజీని వివాహం చేసుకుంది. వారికి ఓ బిడ్డ జన్మించింది. అదే సంవత్సరం బాలాజీ చనిపోయాడు. ఆ తర్వాత 2007లో లలిత ఆకెళ్ల నరసింహ శర్మ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే తన కుమారుడి బిడ్డకు తమను సంరక్షకులుగా ప్రకటించాలని బాలాజీ తండ్రి హనుమంతరావు కోర్టును ఆశ్రయించారు. అయితే బిడ్డను తల్లి నుంచి వేరుచేయడం సరికాదని తీర్పు చెబుతూ ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనిని ఆ తర్వాత రెండు పక్షాలూ హైకోర్టులో సవాల్ చేశాయి. 2014లో హైకోర్టు తీర్పు చెబుతూ.. ఆ పిల్లాడికి సొంత తండ్రి ఇంటి పేరును పెట్టాలని తల్లిని ఆదేశించింది. దీనిని తల్లి లలిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడట్టింది. మొదటి భర్త మరణించిన తర్వాత బిడ్డకు ఏకైక సంరక్షకురాలు తల్లి అని, ఆమె తన బిడ్డకు రెండో భర్త ఇంటి పేరు పెట్టి వారి ఫ్యామిలీలో మమేకం చేయకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. ''ఆ బాలుడి రికార్డుల్లో అసలు తండ్రి పేరును రాయాలని, లేదంటే రెండో తండ్రిని మారుతండ్రిగా పేర్కొనాలి'' అని హైకోర్టు ఆదేశించడాన్ని మతిలేని క్రూరమైన చర్య అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తీర్పు బాలుడి మానసిక ఆరోగ్యం, ఆత్మాభిమానంపై ప్రభుత్వం చూపుతుందన్నది ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తల్లి మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంటి పేరును బిడ్డకు పెట్టుకోవడంలో అసాధారణమేమీ కనిపించలేదని చెప్పింది.

Next Story