మాస్కో – గోవా విమానానికి బాంబు బెదిరింపు.. జామ్‌న‌గ‌ర్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌

Moscow-Goa flight makes emergency landing at Jamnagar airport.అజుర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2023 4:43 AM GMT
మాస్కో – గోవా విమానానికి బాంబు బెదిరింపు.. జామ్‌న‌గ‌ర్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌

అజుర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ర‌ష్యా రాజ‌ధాని మాస్కో నుంచి గోవాకు బ‌య‌లుదేరింది. అయితే.. మార్గ‌మ‌ధ్యంలో ఆ విమానంలో బాంబు ఉన్న‌ట్లు బెరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంట‌నే విమానాన్ని దారి మ‌ళ్లించి గుజ‌రాత్ రాష్ట్రంలోని జామ్‌న‌గ‌ర్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. ఆ స‌మ‌యంలో విమానంలో 236 మంది ప్ర‌యాణీకులు, 8 మంది సిబ్బంది ఉన్నారు.

ల్యాండింగ్ కాగానే ప్ర‌యాణీకుల‌ను విమానం నుంచి దించేసి బాంబు స్క్వాడ్ విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. అయితే.. ఎటువంటి పేలుడు ప‌దార్థాలు విమానంలో ల‌భించ‌లేదు. దీంతో అధికారుల‌తో పాటు విమాన సిబ్బంది, ప్ర‌యాణీకులు అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

దీనిపై జామ్‌న‌గ‌ర్ ఎయిర్ ఫోర్ట్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ..బాంబు బెదిరింపుల‌తో సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది విమానం, ల‌గేజీల‌ని మొత్తం త‌నిఖీ చేశారు. వారికి ఎలాంటి అనుమానాస్ప‌ద వ‌స్తువు క‌నిపించ‌లేదు. విమానం చాలా పెద్ద‌ది కావ‌డంతో త‌నిఖీ చేసేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌ట్టింది. అన్ని అధికారిక కార్య‌క్ర‌మాల పూర్తి అయ్యాక ఈ ఉద‌యం 10.30 గంట‌ల నుంచి 11 గంట‌ల మ‌ధ్య‌లో జామ్‌న‌గ‌ర్ నుంచి గోవాకు విమానం బ‌య‌లుదేరే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పారు.

ఇక‌.. బాంబు బెదిరింపుల నేప‌థ్యంలో గోవాలోని ద‌బోలిమ్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద కూడా ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఎయిర్‌పోర్టుతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో గ‌ట్టి నిఘా ఉంచారు.

Next Story