కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. వ్యాక్సిన్ డ్రైవ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న ఆస్పత్రి వార్డు బోయ్ ఒక రోజు వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. టీకా తీసుకున్న అనంతరం భారత్‌లో అస్వస్థతకు గురైన కేసులను చూశాము కానీ ఓ వ్యక్తి మృతి చెందడం మాత్రం ఇదే మొదటిది కావడం గమనార్హం. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మొరాదాబాద్ ఆస్పత్రిలో వార్డు బాయ్ గా పనిచేసే మహిపాల్ సింగ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదటిరోజు సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. అయితే.. ఆ తరువాతి రోజు అతడు శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఛాతి నొప్పితో బాధపడ్డాడు. సమస్యలు తీవ్రతరం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
మహిపాల్ సింగ్ మృతిపై మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి స్పందిచారు. మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడని, ఒక రోజు తర్వాత శ్వాస ఆడక ఛాతీనొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని, అయితే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కారణంగానే మహిపాల్ మరణించినట్టు తాను భావించడం లేదని చెప్పారు. అతని మృతికి అసలైన కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.