మోదీ కేబినెట్‌లో పదవి దక్కని మాజీమంత్రులు..!
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 12:23 PM GMTమోదీ కేబినెట్‌లో పదవి దక్కని మాజీమంత్రులు..!
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇవాళ మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. సాయంత్రం 7.15 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులతో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.
కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణం చేయనున్న ఎంపీలకు ఇప్పటికే కాల్స్ వెళ్లాయి. వారు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈ మేరకు మోదీ కూడా వారితో సమావేశం అయ్యి పలు కీలక సూచనలు చేశారు. టీడీపీ, జేడీయూ, శివసేన పార్టీలకు కూడా కేబినెట్‌లో పదవులు దక్కుతున్నాయి. కానీ.. గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారు మాత్రం ఈసారి అవకాశాన్ని కోల్పోయారు. బీజేపీ అధినాయకత్వం వారికి మొండి చేయి చూపించింది.
స్మృతీ ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణేలకు ఈ సారి మంత్రి పదవులు దక్కలేదని సమాచారం. స్మృతి ఇరానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథి నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ చేతిలో 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో.. ఆమెకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. గతేడాది ఆమె రాహుల్‌గాంధీని ఓడించారు.. కానీ ఈసారి కిశోరీ లాల్ చేతిలో ఓడిపోయారు. కాగా.. ఇంతకుముందు కేబినెట్‌లో స్మృతి ఇరానీ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నుంచి ఎంపీగా గెలిచిన అనురాగ్ ఠాకూర్‌కి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రధాని మోదీ రెండో టర్మ్‌లోని మంత్రివర్గంలో ఈయన క్రీడలు మరియు సమాచార మరియు ప్రసార శాఖలను నిర్వహించారు.
ఇక మహారాష్ట్రకు చెందిన రత్నగిరి-సింధు దుర్గ్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన నారాయణ రాణేకి కూడా ఈసారి మంత్రి పదవి దక్కేలా లేదు. ఆయన గతంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.