'వన్ ఎర్త్, వన్ హెల్త్'.. జీ7 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు
Modi calls for adopting 'one earth, one health'.కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వన్ ఎర్త్..
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2021 9:35 AM ISTకరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 'వన్ ఎర్త్.. వన్ హెల్త్' (ఒకే భూమి, ఒకే ఆరోగ్యం) అనే సమిష్టి బావనతో ప్రపంచం ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బ్రిటన్‌లో జరుగుతున్న జీ7 సదస్సును ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడిన మోదీ.. ఈ నినాదాన్ని వినిపించారు. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను నివారించడానికి ప్రజాస్వామిక, పారదర్శక సమాజాలు ప్రత్యేక బాధ్యతను తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ దిశగా అంతర్జాతీయ ఐక్యత, నాయకత్వం, సంఘీభావం ఉండాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్‌కు అండగా నిలిచిన జీ7 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా మహమ్మారిపై పోరులో కీలకమైన టీకాల విషయంలో ఆటంకాలొద్దని మోదీ ఆకాంక్షించారు. కొవిడ్ సంబంధిత టెక్నాలజీ, టీకాలపై మేధో సంపత్తి హక్కులు-వాణిజ్య పరమైన అంశాల(ట్రిమ్స్) ఒప్పందాలు అడ్డు రాకూడదని అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రపంచంలో అందరికీ ఆరోగ్యం(వన్ ఎర్త్-వన్ హెల్త్) సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య పాలనను మెరుగుపరిచేందుకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. కరోనా మహమ్మారి నుంచి తిరిగి పూర్వ దశకు చేరుకోవడం, భవిష్యత్ మహమ్మారులను నివారించే లక్ష్యంతో 'బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్-హెల్త్' పేరిట నిర్వహించిన చర్చాగోష్టిలో మోదీ ప్రసంగించారు.
జీ7లో యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా,ఆస్ట్రేలియాలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నాయి.