ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. దేశంలో కరోనా కట్టడిలో భాగంగా కాస్త పాజిటివ్ కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో వ్యాక్సిన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోదీ శుభవార్త వినిపించారు. కొద్ది రోజుల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాగా, వ్యాక్సిన్ ధరపై రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్ ఉత్పత్తి, పురోగతి, పంపిణీ తదితర అంశాలపై కేంద్రం అఖిల పక్షలకు వివరించింది. వ్యాక్సిన్ తయారీలో తప్పకుండా విజయం సాధిస్తామని మన శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారని, భద్రమైన, చవకైన వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎంతో ఎదురు చూస్తోందని అన్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు అంతా భారత్ వైపే ఉందన్నారు.
మరి కొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారన్నారు. టీకాను ఆమోదించిన వెంటనే దేశంలో వ్యాక్సినేషన్ పనులు ప్రారంభిస్తామన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఇస్తామన్నారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామన్నారు.