పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం శివసేన కార్యకర్తలు, ఖలిస్థాన్ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాళిమాత ఆలయం వద్ద ఇరువర్గాలు రాళ్లు రువ్వుకొంటూ కత్తులు దూసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడగా.. ఉద్రిక్తలను తగ్గించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పాటియాలాకు అదనపు బలగాలను రప్పించారు.
అయినప్పటికీ ఉద్రిక్తలు తగ్గకపోగా.. వదంతులు వ్యాపిస్తుండడంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మకూడదని, శాంతియుతంగా ఉండాలని అధికారులు సూచించారు.
హింసను నియంత్రించడంలో విఫలం అయ్యారని, శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందడంతో రాష్ట్ర పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది భగవంత్ మాన్ ప్రభుత్వం. ముగ్గురు ఉన్నతాధికారులను తొలగించింది.