బీజేపీకి షాక్.. అవిశ్వాస తీర్మానానికి ఎన్డీఏ భాగస్వామి మద్దతు

అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2023 4:11 PM IST
MNF,  no confidence motion, Shock,  BJP,

బీజేపీకి షాక్.. అవిశ్వాస తీర్మానానికి ఎన్డీఏ భాగస్వామి మద్దతు 

ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్‌ సమావేశాల్లో రచ్చ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను విపక్ష పార్టీల ఎంపీలు ఎండగడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఓ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపింది. దాంతో.. ఎన్డీఏలో లుకలుకలు బయటపడ్డాయంటూ పలువురు విపక్ష ఎంపీలు విమర్శలు చేస్తున్నారు.

ప్రతిపక్ష కూటమి ఇండియా ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగయ్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపింది. ఈ అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో మంగళవారం నుంచి రచ్చ జరుగుతోంది.

అయితే.. ఎంఎన్‌ఎఫ్‌ ఎంపీ సి లాల్రోసింగ మీడియాతో మాట్లాడారు. తాను ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేస్తానని చెప్పారు. మణిపూర్‌లో హింసాకాండను అదుపు చేయడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఈ సందర్భంగా సి.లాల్రోసింగ పేర్కొన్నారు. మణిపూర్‌లో హింస కారణంగా ఎన్నో దారుణలు జరిగాయని చెప్పుకొచ్చారు. దేశం తలదించుకునే సంఘటనలు జరిగినా.. పరిష్కారం చూపేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో విఫలం అయ్యాయని విమర్శించారు. అందుకే తాను అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సి. లాల్రోసింగ తెలిపారు.

కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నాను కానీ.. బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు భావించొద్దని సి లాల్రోసింగ అన్నారు. ప్రభుత్వాలు, ముఖ్యంగా మణిపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైందని చెప్పారు. మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ సమస్యపై తాను తమ పార్టీ అధ్యక్షుడు, మిజోరాం సీఎం జొరాంతంగతో మాట్లాడనని.. తమ పార్టీ నేతలంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడంపై ఏకాభిప్రాయంగా ఉన్నామని ఎంపీ సి లాల్రోసింగ అన్నారు.

ఈ తీర్మానంలో గెలవాలంటే ఎన్డీఏకు 272 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ.. ఎన్డీఏకే దాదాపు 331 మంది ఎంపీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఇండియా కూటమికి 144 మంది ఎంపీల బలం ఉంది. బీఆర్ఎస్ మద్దతు తెలిపితే 152కు చేరనుంది. తీర్మానం వీడిపోవడం ఖాయమని అర్థం అవుతున్నా.. మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ మాట్లాడేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇండియా అలైన్స్.

Next Story