'నేను బాధితురాలిని.. నాకు న్యాయం కావాలి'.. జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత 4 పేజీల లేఖ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత మీడియాకు నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు.

By అంజి  Published on  9 April 2024 1:09 PM IST
MLC Kavitha, Delhi liquor scam

'నేను బాధితురాలిని.. నాకు న్యాయం కావాలి'.. జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత 4 పేజీల లేఖ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత మీడియాకు నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. లిక్కర్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను తప్పు చేశాననడానికి ఆధారాలు కూడా లేవన్నారు. రెండున్నరేళ్ల విచారణలో ఎలాంటి రుజువు లభించలేదన్నారు. వేరే వ్యక్తుల స్టేట్‌మెంట్‌తో తను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదని, కేవలం తాను బాధితురాలిని మాత్రమేనని కవిత పేర్కొన్నారు. 'నేను బాధితురాలిని.. నా అరెస్టు అక్రమం.. నాకు న్యాయం కావాలి' అంటూ తీహార్ జైలు నుంచి మంగళవారం లేఖ విడుదల చేశారు.

రాజకీయంగా తనను దెబ్బతీయడానికి, తన రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగా పెట్టిన కేసు అని లేఖలో పేర్కొన్నారు. ''నా మొబైల్ నెంబర్‌ను టీవీ ఛానల్స్‌లో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. నాలుగు పర్యాయాలు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించాను. దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్లు అన్నీ అందజేశాను. కానీ వాటిని ధ్వంసం చేసినట్టు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారు. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు'' అని కవిత పేర్కొన్నారు.

లేఖ విడుదలకు ముందు ఎమ్మెల్సీ కవిత కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పాల్సింది కోర్టులో చెప్పానని అన్నారు. జైలులో సీబీఐ తనను ప్రశ్నించినట్టు తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తాను చెప్పాల్సిన అంశాలను లేఖలో పేర్కొన్నట్టు తెలిపారు.

మరోవైపు క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు కోర్టు పొడిగించింది. 14 రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో ఇవాళ అధికారులు ఆమెను కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ మ‌నీలాండ‌రింగ్ కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని, క‌విత బ‌య‌ట ఉంటే ద‌ర్యాప్తును ప్రభావితం చేస్తార‌ని ఈడీ వాద‌న‌లు వినిపించింది. జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని మ‌రో 14 రోజులు పొడిగించాల‌ని కోరింది. అయితే క‌స్ట‌డీ పొడిగింపు కోరేందుకు ఈడీ వ‌ద్ద కొత్త‌గా ఏమీ లేద‌ని క‌విత త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు.. జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని పొడిగిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

Next Story