గొంతులో ఆహారం ఇరుక్కుని.. నిద్రలో ఎమ్మెల్యే కూతురి మృతి

MLA's daughter died after getting food stuck in her throat. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్‌ మౌర్య (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

By అంజి  Published on  28 Aug 2022 8:08 AM IST
గొంతులో ఆహారం ఇరుక్కుని.. నిద్రలో ఎమ్మెల్యే కూతురి మృతి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్‌ మౌర్య (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భోపాల్‌లోని అయోధ్యనగర్‌లో గల తన అత్తమామల ఇంట్లో గురువారం నాడు శవమై కనిపించింది. శనివారం నాడు.. సదరు మహిళ నిద్రలో గురక పెడుతున్నప్పుడు శ్వాసనాళంలో కొన్ని ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మృతురాలు పూనమ్ మౌర్య (32) తండ్రి రాజేంద్ర మౌర్య యూపీలోని ప్రతాప్‌గఢ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం అత్తమామలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం తండ్రి, కుటుంబసభ్యులు భోపాల్‌కు చేరుకోగానే పోస్టుమార్టం నిర్వహించగా.. నిద్రిస్తున్న మహిళ శ్వాసనాళంలో కొన్ని ఆహారపదార్థాలు కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. 2017లో సురభి కాంప్లెక్స్ అయోధ్య నగర్‌లోని సంజయ్ మౌర్యను పూనమ్‌ను వివాహం చేసుకున్నారని అయోధ్య నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నీలేష్ అవస్థి తెలిపారు. సంజయ్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతనికి సొంత వ్యాపారం కూడా ఉంది.

గురువారం ఉదయం సంజయ్ నిద్ర లేచి చూసే సరికి భార్య పూనమ్ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే భార్యను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు హమీదియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడికి చేరుకోగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తీవ్రత దృష్ట్యా వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. పూనమ్ తండ్రి రాజేంద్ర, ఇతర బంధువులు శుక్రవారం ఉదయం భోపాల్ చేరుకున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం పోస్టుమార్టం వీడియోగ్రాఫ్ చేసి నిర్వహించిందని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తెలిపారు. గురక కారణంగా పూనమ్ శ్వాసనాళంలో కొన్ని ఆహారపదార్థాలు ఇరుక్కున్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. దీంతో ఆమె మృతి చెందింది.

Next Story