ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో మోడల్ దీక్షా సింగ్ ఓడిపోయింది.జాన్‌పూర్ జిల్లా బక్షా డెవలప్ మెంట్ బ్లాక్ పంచాయతీలో 26వ వార్డు నుంచి ప్రముఖ మోడల్, అందాల రాణి, మిస్ ఇండియా రన్నరప్ దీక్షా సింగ్ బరిలోకి దిగింది. అయితే ఆమె ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పంచాయతీ సర్పంచ్ గా ప్రజలకు మంచి చేయాలని అనుకున్న దీక్షా సింగ్ ను ప్రజలు గెలిపించలేదు. ఆమెకు కనీసం 2500 ఓట్లు కూడా పడలేదు.
దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామం. వ్యాపార రీత్యా గోవాలో సెటిల్ అయ్యారు. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్‌లో ట్రాన్స్‌పోర్టు బిజినెస్ నిర్వహిస్తున్నారు. దీక్షా సింగ్ తల్లి గృహిణి. దీక్షా సింగ్ 2015లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచారు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాటు పలు యాడ్స్ లో నటించారు. తండ్రి కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీక్ష తండ్రి జితేంద్ర సింగ్.. పంచాయతీ ఎన్నికల్లో బక్షా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని 26వ వార్డు నుంచి పోటీ చేసేందుకు ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు. అయితే ఈ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో ఆయన తన కూతురు దీక్షను బరిలోకి దించారు. అయితే ఆమెకు ఓట్లు వేయడానికి మాత్రం ఓటర్లు ముందుకు రాలేదు. మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి 7500కు పైగా ఓట్లు రాగా.. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి 5000కు పైగా ఓట్లు వచ్చాయట. ఇక దీక్షా సింగ్ కు మాత్రం 2500 ఓట్లు కూడా పడలేదని.. ఆమె మూడో స్థానంలో నిలిచిందని అన్నారు. గ్లామర్ కు ఓట్లు రాలవని దీక్షా సింగ్ వ్యవహారం నిరూపించింది.