పవర్‌ఫుల్‌ యుద్ధ ట్యాంకులను ఆర్డర్‌ చేసిన కేంద్రం..!

Ministry of Defence orders 118 Arjun tanks.భారత ఆర్మీలో మరిన్ని అత్యాధునిక యుద్ధ ట్యాంకులు చేరనున్నాయి.

By అంజి  Published on  24 Sep 2021 8:34 AM GMT
పవర్‌ఫుల్‌ యుద్ధ ట్యాంకులను ఆర్డర్‌ చేసిన కేంద్రం..!

భారత ఆర్మీలో మరిన్ని అత్యాధునిక యుద్ధ ట్యాంకులు చేరనున్నాయి. 118 అర్జున్ ఎమ్‌కె-1 యుద్ధ ట్యాంకులను సమకూర్చుకునేందుకు చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యుద్ధ ట్యాంకుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.7,523 వ్యయం ఖర్చు చేయనున్నది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి ఈ ఆర్డర్ మరింత ప్రోత్సహాన్ని అందిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఊహించిన ఆత్మ నిర్భర్ భారత్‌కు ఇది ముందడుగని పేర్కొంది. ఎమ్‌కె -1 అనేది అర్జున్‌ యుద్ధ ట్యాంక్‌కు సంబంధించిన కొత్తరకం. ఇది ఫైర్ పవర్, మొబిలిటీతో పాటు ఎక్కువ కాలం పని చేసేలా రూపొందించబడింది. ఎమ్‌కె-1 యుద్ధ ట్యాంక్‌లో 72 కొత్త ఫీచర్లతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడుతుంది.

ఈ యుద్ధ ట్యాంక్‌ పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఖచ్చితమైన టార్గెట్‌తో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయగలదు. యుద్ధ భూమిలో అప్రయత్న కదలికలను సైతం నిర్దారిస్తుంది. అనేక కొత్త ఫీచర్లను చేరుస్తూ అర్జున్ ఎమ్‌కె-1 యుద్ధ ట్యాంక్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)తో కలిసి కంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అభివృద్ధి చేసింది. సరిహద్దుల్లో మరింత రక్షణకు ఈ యుద్ధ ట్యాంక్‌లు ఉపయోగపడనున్నాయి. జూన్‌ 2010 నుండి అర్జున్ ఎమ్‌కె-1 యుద్ధ ట్యాంక్‌ సంబంధించి అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. కేంద్ర రక్షణ శాఖ కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో భాగంగా మొదట 5 అర్జున్ ఎమ్‌కె-1 యుద్ధ ట్యాంక్‌లు రెండు సంవత్సరాల 6 నెలల్లోపు భారత ఆర్మీకి అందనున్నాయి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 30 ట్యాంకుల చొప్పున మిగతా ట్యాంకులు భారత అమ్ములపొదిలో చేరుతాయి.

Next Story
Share it