లఖింపుర్ ఖేరీ కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కు భారత అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆశిష్‌మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారం రోజుల్లోగా పోలీసులకు ఆశిష్ లొంగిపోవాలని సుప్రీం కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లఖింపూర్ ఖేరీ హింస కేసులో ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బాధిత కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. అసంబద్ధ కారణాలతో హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, అవసరమైన అంశాలను కోర్టు పట్టించుకోలేదని తన తీర్పులో పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. వారం రోజుల్లోగా ఆశిష్ మిశ్రా సరెండర్ కావాలని ఆదేశించింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీం కోరింది.
గతేడాది అక్టోబర్‌లో లఖింపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులకిపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.