కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే కారులో వెళ్తూ మొక్కజొన్న కంకులను బండిని చూసి ఆగారు. వెంటనే బండి దగ్గరికి వెళ్లి మూడు మొక్క జొన్న కంకులను కాల్పించుకుని, ఉప్పు రాయించుకున్నారు. ఆ తర్వాత ఒక్కోటీ ఎంత అని విక్రయదారుడిని కేంద్రమంత్రి అడిగారు. దానికి రూ.15 అంటూ విక్రయదారు సమాధానం చెప్పారు. ''మూడు కంకులకు రూ.45 రూపాయలు.. ఇంత అధిక ధరకు విక్రయిస్తావా'' విక్రయదారుని మంత్రి ప్రశ్నించారు. దానికి విక్రయదారు ప్రతిస్పందించాడు.
''రూ.15 అన్నది స్టాండర్ట్ ధర. మీకు కారు ఉందని చెప్పి ధరను పెంచలేదు'' అని బదులిచ్చాడు. దీంతో ఇక్కడ మొక్కజొన్న ఉచితంగా లభిస్తుందని తెలుసా అని మంత్రి కులస్తే ప్రశ్నించారు. చివరకు ఆ కుంకుల ధరను చెల్లించి వచ్చేశారు. "ఇవాళ సియోని నుండి మాండ్లాకు వెళ్తున్నాను. స్థానిక మొక్కజొన్న రుచి చూశారు. మనమందరం స్థానిక రైతులు, దుకాణదారుల నుండి ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధిని, కల్తీ లేని వస్తువులను నిర్ధారిస్తుంది" అని కులస్తే గురువారం ట్వీట్ చేశారు.
కానీ మొక్క జొన్న కోసం మంత్రి బేరాలాడిన తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. మంత్రికి పెరిగిన ధరల మంట తెలిసొచ్చిందన్న కామెంట్లు చేస్తున్నారు.