మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 87 అంతర్జాతీయ విమానాలు రద్దు కాగా, అందులో 37 విదేశాలకు వెళ్లాల్సినవి, 50 విదేశాల నుండి రావాల్సినవి ఉన్నాయి. గడిచిన రెండు రోజుల్లో భారతీయ ఎయిర్‌లైన్స్ సుమారు 760 అంతర్జాతీయ విమానాలను రద్దు చేశాయి. ఆయా దేశాల గగనతలం మూసివేయడం వల్ల విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది.
దేశంలోనే అతిపెద్దదైన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) నుండి రోజుకు 1,300 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల షెడ్యూల్స్‌లో మార్పులు లేదా ఆలస్యం జరగవచ్చని విమానాశ్రయ నిర్వహణ సంస్థ (DIAL) ప్రకటించింది.