దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలతో పాటు లాక్‌డౌన్ లు విధించడంతో.. గత కొద్ది రోజులుగా రోజువారి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికి యాక్టివ్ కేసులు గరిష్ఠస్థాయిలో ఉండడంతో పాటు మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో(ఏప్రిల్ 29న) జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దక్షిణ, ఈశాన్యంలోని పలు ప్రాంతాలకు మినహాయింపును ఇచ్చింది.
ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మాట్లాడుతూ.. రోజువారి నమోదైయ్యే కరోనా కేసులు తగ్గుతున్నాయని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందన్నారు. ఈ మేరకు నియంత్రణ చర్యలు కచ్చితంగా కొనసాగించడం చాలా ముఖ్యమన్నారు. స్థానిక పరిస్థితులు, అవసరాలు, వనరులను అంచనా వేసిన తర్వాత రాష్ట్రాలు, యూటీలు ఏదైనా సడలింపులను తగిన సమయంలో, గ్రేడెడ్ పద్ధతిలో పరిగణించవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాలు జూన్ 30 వరకు కొనసాగుతాయని చెప్పారు.
ఏప్రిల్ 25న కేంద్ర వైద్య ఆరోగ్య శౄఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లులతో పాటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. ఐసోలేషన్ వసతులతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. కాగా.. తాజా మార్గదర్శకాల్లో లాక్‌డౌన్‌పై హోంశాఖ ఎలాంటి ప్రస్తావన చేయలేదు.