మానవత్వం చచ్చిపోతోంది. మతిస్థిమితం లేని ఓ మహిళ పట్ల సెక్యూరిటీ గార్డు కర్కశంగా ప్రవర్తించాడు. ఆమెకు సహాయం చేయాల్పింది పోయి ఆస్పత్రి లోపలి నుంచి గేటు వరకు మహిళ చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి పడేశాడు. మధ్యలో బురద ఉన్నప్పటికి ఆమెను అందులోంచే లాక్కెల్లాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభుత్వాసుపత్రిపై నెటీజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా ఆస్పత్రికి గురువారం ఓ మహిళను ఎవరో తీసుకొచ్చి అక్కడ వదిలివేసి వెళ్లిపోయారు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదు. ఆ మహిళకు డాక్టర్లు చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు ఆమహిళను 300 మీటర్ల దూరం లాక్కెళ్లి గేటు బయట పడేశాడు. మధ్యలో బురదలోనూ అలాగే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. అధికారులు స్పందించి దారుణానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డును ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఆమె పట్ల ఎందుకంతా అమానుషంగా ప్రవర్తించాడో చెప్పేందుకు వారు నిరాకరించారు. ఆస్పత్రి సిబ్బంది సూచనలతోనే గార్డు ఇలా చేసినట్లు తెలుస్తోంది.