ఆస్పత్రిలో వైద్య విద్యార్థుల రీల్స్, షాకిచ్చిన యాజమాన్యం

వైద్య విద్యార్థులు కూడా ఆస్పత్రిలో రీల్స్‌ చేశారు. ఇదే వారిని చిక్కుల్లో పడేసింది.

By Srikanth Gundamalla  Published on  11 Feb 2024 10:51 AM IST
medical students, reels,  hospital, karnataka,

ఆస్పత్రిలో వైద్య విద్యార్థుల రీల్స్, షాకిచ్చిన యాజమాన్యం

ప్రస్తుత కాలంలో సోషల్‌ మీడియాను వాడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ ఫోన్లు ఉంటున్నాయి. దాంతో.. సోషల్‌ మీడియా ద్వారా వారిని పరిచయం చేసుకుంటూ.. రీల్స్‌ సహా ఇతర పోస్టులు పెడుతున్నారు. కొందరు పాపులారిటీ కోసం ఎక్కడున్నామో కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. తాజాగా వైద్య విద్యార్థులు కూడా ఆస్పత్రిలో రీల్స్‌ చేశారు. ఇదే వారిని చిక్కుల్లో పడేసింది. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశం అవుతోంది.

కర్ణాటకలోని గడగ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (GIMS)లో 38 మంది వైద్య విద్యార్థులు చదువుతున్నారు. అయితే.. వీరి ట్రైనింగ్‌ మరో 20 రోజుల్లో ముగియనుంది అనగా ఆస్పత్రిలో రీల్స్‌ చేశారు. త్వరలోనే కాలేజ్‌లో జరగనున్న ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం ఎలాంటి అనుమతి లేకుండా ఆస్పత్రిలో రీల్స్ చేశారు. ఆ తర్వాత వీడియోను వారివారి సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా అప్‌లోడ్‌ చేశారు. అవి కాస్త వైరల్ అయ్యాయి. దీనిపై జీఐఎంఎస్‌ ఆస్పత్రి యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. సదురు వైద్య విద్యార్థులపై చర్యలు తీసుకుంది.

ఈ మేరకు వివరించిన ఆస్పత్రి యాజమాన్యం.. హాస్పిటల్‌లో రీల్స్ చేసేందుకు విద్యార్థులకు అనుమతి లేదని స్పష్టంగా చెప్పింది. వాటిని ప్రోత్సహించము అని వెల్లడించింది. విద్యార్థులు ఏం చేయాలనుకున్నా రోగులకు ఇబ్బంది కలగకుండా.. ఆస్పత్రి వెలుపల చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి తప్పిదానికి పాల్పడినందుకు.. సుదురు వైద్య విద్యార్థులకు జరిమానాతో పాటు, ట్రైనింగ్‌ను మరో 10 రోజుల పాటు పొడిగించామని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.


గతంలో చిత్రదుర్గ జిల్లాలో కూడా ఓ వైద్యుడు తన ప్రీవెడ్డింగ్ షూట్‌ ఆపరేషన్ గదిలో చేసుకున్నాడు. దీనిపై కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ సీరియస్‌గా స్పందించారు. తక్షణమే వైద్యుడిని సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Next Story