దేశవ్యాప్తంగా నేడు వైద్య సేవలు బంద్

ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  17 Aug 2024 6:39 AM IST
Medical services,  close, india,

దేశవ్యాప్తంగా నేడు వైద్య సేవలు బంద్ 

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు నిరసనగా శనివారం దేశ వ్యాప్తంగా పలు రకాల వైద్యసేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అత్యవసరం కాని వైద్యసేవలన నిలిపివేయనున్నట్లు ఐఎంఏ ప్రకటించింది. అయితే.. ఐఎంఏ కేంద్రం ముందు ఐదు డిమాండ్లు పెట్టి నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది.

ఎయిర్‌పోర్టుల మాదిరిగానే దేశవ్యాప్తంగా ఉన్న ఉన్న దవాఖానలను కూడా సేఫ్‌ జోన్లుగా ప్రకటించాలని ఐఎంఏ చీఫ్ డాక్టర్ ఆర్‌వీ అశోకన్ డిమాండ్ చేశారు. వైద్యులు, సిబ్బందిపై జరుగుతున్న దాడుల కట్టడి కోసం చట్టం తీసుకురావాలని కోరారు. అలాగే ట్రైనీ డాక్టర్‌ బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వైద్యుల పని గంటలు, పని పరిస్థితులపై ఐఎంఏ మరో డిమాండ్‌ చేసింది. హత్యాచారానికి గురైన బాధితురాలు వరుసగా 36 గంటల పాటు డ్యూటీలో ఉన్నారని, ఇది సరైనదేనా? అని ప్రశ్నించారు.

ఇక కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనతో వైద్యసంస్థలకు కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న వైద్యసిబ్బందిపై దాడి జరిగిన ఆరు గంటల్లోగా ఇన్‌స్టిట్యూషనల్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ దవాఖానలు, ఎయిమ్స్‌ డైరెక్టర్లకు, అన్ని మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ అతుల్‌ గోయెల్‌ ఆదేశాలిచ్చారు. విధుల్లో ఉండగా ఏ ఆరోగ్య కార్యకర్తపైనైనా దాడి జరిగితే.. 6 గంటల్లోగా ఇన్‌స్టిట్యూషనల్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే బాధ్యత వైద్య సంస్థ అధిపతిదే కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Next Story