విషాదం.. తమిళనాడు ఎంపీ మృతి

తమిళనాడులోని ఎండీఎంకే నేత, ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తి (77) మరణించారు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.

By అంజి  Published on  28 March 2024 3:04 AM GMT
MDMK MP, Erode, Ganesamoorthy, Tamilanadu

విషాదం.. తమిళనాడు ఎంపీ మృతి

తమిళనాడులోని ఎండీఎంకే నేత, ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తి (77) మరణించారు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. టికెట్‌ రాలేదనే ఆవేదనతో ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మార్చి 24న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

ఈరోడ్‌లోని సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ, ఎండీఎంకేకి చెందిన గణేశమూర్తి గుండెపోటుతో గురువారం ఉదయం మరణించినట్లు ఏఎన్‌ఐ రిపోర్ట్‌ చేసింది. మార్చి 28, 2024, గురువారం ఉదయం 5.05 గంటలకు గుండెపోటుతో మరణించారు. మార్చి 24న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్ నుంచి డీఎంకే టికెట్‌పై ఎన్నికైన గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురై మార్చి 24న విషం తాగి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

ప్రాథమిక తనిఖీ తర్వాత, అతన్ని ఐసియులో చేర్చారు. వెంటిలేటర్‌పై ఉంచినట్లు పిటిఐ తెలిపింది. అనంతరం ఎంపీని సమీపంలోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స సమయంలో గణేశమూర్తి ఆరోగ్యంపై ఆరా తీసేందుకు రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్‌ ముత్తుసామి, మోదకురిచ్చి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీ సరస్వతి, అన్నాడీఎంకే నేత కేవీ రామలింగం సహా పలువురు రాజకీయ నాయకులు ఆస్పత్రికి వచ్చారు.

మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గణేశమూర్తి ఎండీఎంకే శ్రేణుల్లో ప్రముఖ పదవులు చేపట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈరోడ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. డీఎంకే ఈరోడ్‌లో తన అభ్యర్థిని నిలబెట్టింది. తిరుచ్చి స్థానాన్ని ఎండీఎంకేకి ఇవ్వాలని నిర్ణయించింది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో కుమారుడు దురై వైకో తిరుచ్చి నుండి పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు.

Next Story