లెహంగా నచ్చలేదని.. పెళ్లికి నిరాకరించిన యువతి.. అంతలోనే సీన్ రివర్స్
Marriage broke up in haldwani due to a dispute over lehenga. వరుడి ఇంటి సభ్యులు సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చిన డ్రెస్సులు.. నచ్చలేదని ఓ యువతి ఏకంగా తన పెళ్లినే క్యాన్సిల్
By అంజి Published on 9 Nov 2022 9:06 AM GMTవరుడి ఇంటి సభ్యులు సెలెక్ట్ చేసి మరీ తీసుకొచ్చిన డ్రెస్సులు.. నచ్చలేదని ఓ యువతి ఏకంగా తన పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంది. తనకు ఆ లెహంగా నచ్చలేదని తల్లి చెప్పిన మాటలు విన్న వధువు పెళ్లి చేసుకోవాడినికి నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ మొదలైంది. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో జరిగింది. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్మోరా జిల్లాకు చెందిన యువకుడితో హల్ద్వానీ నివాసి అమ్మాయికి వివాహం నిశ్చయమైంది.
నవంబర్ 5న వివాహం జరగాల్సి ఉండగా, జూన్‌లో ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి పనుల్లో భాగంగా ఇరు కుటుంబాలు పెళ్లి కార్డులు సైతం అచ్చు వేయించి పంచడం మొదలు పెట్టారు. ఇంతలోనే ఇరు వర్గాల మధ్య ఓ విషయమై గొడవ మొదలైంది. పెళ్లి కూతురి కోసం వరుడి తండ్రి లక్నో నుంచి ఓ లెహంగాను ఆర్డర్ చేశారు. లెహంగా డెలివరీ కాగానే.. పెళ్లికి ముందు ఆమెకు అందించారు. అయితే ఆ లెహంగాను చూసిన యువతి తనకు నచ్చలేదని తేల్చి చెప్పింది. దీని తర్వాత వరుడి తండ్రి తన ఏటీఎం కార్డును కోడలికి ఇచ్చి, ఆమెకు నచ్చిన లెహంగాను తీసుకోవాలని కోరాడు. అయితే ఆమె పెళ్లికి నిరాకరించింది. అక్టోబరు 30న వారిద్దరూ పెళ్లి చేసుకోకూడదని ఒప్పందం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే అక్టోబర్30న యువకుడి బంధువులు యువతి ఇంటికి చేరుకుని రూ.లక్ష ఇచ్చి పెళ్లి రద్దు చేసుకున్నారు. డబ్బులు ఇచ్చిన్నట్లు రుజువుగా ఓ వీడియో కూడా తీసుకున్నారు. ఒప్పందంతో పెళ్లి రద్దు విషయం ఓ కొలిక్కి వచ్చింది అనుకునేలోపే మరో ట్విస్ట్ ఎదురైంది. పెళ్లి వద్దనుకున్న యువతి కుటుంబ సభ్యులు.. మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకుని యువకుడి ఇంటికి వచ్చారు. దీంతో మరోసారి ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం ఇక తేలదని యువకుడి పక్షం వారు హల్ద్వానీ కొత్వాలిలో ఫిర్యాదు చేశారు. అక్కడకు వెళ్లి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. చివరికి పోలీసులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.