మార్చి నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు గత మార్చి నెలకు సంబంధించి భారీగా నమోదు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 1 April 2024 5:31 PM ISTమార్చి నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు గత మార్చి నెలకు సంబంధించి భారీగా నమోదు అయ్యాయి. మార్చి నెలకు గాను రూ.1.78 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. విషయం స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 11.5 శాతం మేర పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 2023-24 మొత్తంగా రూ.20.14 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలు అయ్యింది. కాగా.. మార్చి నెల జీఎస్టీ వసూలు రెండో అత్యధికం కావడం విశేషం.
జీఎస్టీ అమలులోకి వచ్చాక 2023 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్లు వసూలు అయ్యింది. ఆ తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. మొత్తం వసూళ్లయిన జీఎస్టీలో సీజీఎస్టీ వాటా రూ.34,532 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,947 కోట్లుగా నమోదు అయ్యింది. ఇక సెస్సుల రూపంలో మరో రూ.12,259 కోట్ల జీఎస్టీ వసూలు అయ్యింది. అంతకుముందు ఏడాది సగటున నెలకు రూ.1.5 లక్షల కోట్ల చొప్పున జీఎస్టీ వసూళ్లు జరగ్గా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.1.68 లక్షల కోట్లకు పెరిగింది.
ఇక తెలంగాణలో గత ఏడాది మార్చిలో రూ.4,804 కోట్ల జీఎస్టీ వసూలు నమోదు అయ్యింది. ఈ ఏడాది ఆ మొత్తం రూ.5,399 కోట్లకు పెరిగింది. అంటే తెలంగాణలోనే 12 శాతం వృద్ధి నమోదు అయ్యింది. ఇక ఏపీలో 16 శాతం వృద్ధి నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. గతేడాది అక్కడ రూ.3,532 కోట్లు జీఎస్టీ వసూళ్లు కాగా.. ఇప్పుడు రూ.4,082 కోట్లకు పెరిగాయి.