'ఆపరేషన్ ప్రహార్' ఎందుకు..?
Maoists operation Prahar 3.భద్రతా బలగాలను ట్రాప్ చేసి హతమార్చిన మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లక్ష్యంగా 'ఆపరేషన్ ప్రహార్ 3'ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 7 April 2021 9:58 AM ISTఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో బాగా వినిపించిన పేరు మావోయిస్టు హిడ్మా. సుమారు 40 ఏళ్ల వయసు, సన్నగా ఉండే ఈ మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసుల మరణాలకు కారకుడట. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో మావోయిస్టుల ట్రాప్ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్ ఫెయిలవ్వడంపై పునరాలోచనలో పడ్డారు. వందల సంఖ్యలో ఉండే మావోయిస్టుల కోసం వేల సంఖ్యలో బలగాలు వెళ్తే.. సంఖ్యా బలంలో పైచేయి సాధించి, సులభంగా విజయం సాధించవచ్చని ఈ అధికారులు భావించారు. అయితే.. తెర్రంలో ఉన్నానంటూ హిడ్మా తన ఉనికిపై లీకులు ఇచ్చి, తమను ట్రాప్‌లోకి లాగాడని.. శనివారం నాటి ఎదురు కాల్పుల తర్వాత గానీ గుర్తించలేకపోయారు.
ప్రస్తుతం ఉన్నతాధికారులు ఆపరేషన్‌కు ముందు, తరువాత పరిణామాలను విశ్లేషిస్తున్నారు. గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. రాకేశ్వర్ సింగ్ అనే కోబ్రా కమాండోను కూడా పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి, సేఫ్‌జోన్‌కు వెళ్లిపోయారని భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం మావోయిస్టులు విడుదల చేసిన ఓ లేఖలో.. రాకేశ్వర్ తమ వద్ద క్షేమంగానే ఉన్నాడని పేర్కొనడాన్ని బట్టి.. కేవలం సేఫ్‌జోన్‌కు వెళ్లడానికే అతణ్ని అపహరించినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా బలగాలను ట్రాప్ చేసి హతమార్చిన మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లక్ష్యంగా 'ఆపరేషన్ ప్రహార్ 3'ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మరో 8 మంది మావోయిస్టులనూ హిట్ లిస్ట్ లో పెట్టింది. వారికి సంబంధించి వాంటెడ్ జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా యువత మావోయిస్టులుగా మారేలా ప్రేరేపించే వ్యక్తులను కూడా గుర్తించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.