గొడవలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో అర్ధరాత్రి భూకంపం

ఉక్రుల్‌ జిల్లాలో అర్ధరాత్రి 12:14 గంటలకు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  8 July 2023 7:34 AM IST
Manipur, Ukhrul, Earthquake, NCS,

గొడవలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో అర్ధరాత్రి భూకంపం

రెండు కమ్యూనిటీల గొడవతో మణిపూర్‌లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో.. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే అర్ధరాత్రి మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. ఉక్రుల్‌ జిల్లాలో అర్ధరాత్రి 12:14 గంటలకు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.3గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 70 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. ఉక్రుల్‌కు భూకంప కేంద్రం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. కాగా.. అర్ధరాత్రి వేళ భూమి కంపిచడంతో జనాలంతా ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. స్వల్పంగానే భూకంపం సంభవించడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎన్‌సీఎస్‌ తెలిపింది.

కాగా.. మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిష్ణుపూర్‌ జిల్లా కంగ్‌వాయి ప్రాంతంలో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో నలుగురు మృతిచెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. అయితే.. మృతుల్లో పోలీసు కమాండో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాల నుంచి కొంతమంది కిందకు వచ్చి.. లోయలోని పలు గ్రామాలను నిప్పుబెట్టి తగలబెట్టేందుకు ప్రయత్నించారు. వెనక్కి వెళ్లిపోవాలని స్థానికులు కోరినా వారు వినలేదని అధికారులు చెప్పారు. అయితే.. ఏ ఇంటికి నిప్పు అంటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. నలుగురు మరణించారు. మణిపూర్‌లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు.

Next Story