వారికి ఎల్‌పీజీ సిలిండర్లు బంద్.. కేంద్రం కీలక ప్రకటన
పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయొద్దని కేంద్రం ఆదేశించింది.
By - అంజి |
వారికి ఎల్‌పీజీ సిలిండర్లు బంద్.. కేంద్రం కీలక ప్రకటన
పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయొద్దని కేంద్రం ఆదేశించింది. పీఎన్‌జీ వినియోగించుకుంటూనే డొమెస్టిక్ సిలిండర్లను తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే ఎల్‌పీజీ కనెక్షన్లను సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా ఎల్‌పీజీ కనెక్షన్లూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో పీఎన్‌జీ సౌకర్యం ఉంది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎల్‌పీజీ (LPG) వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, ఇంట్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్నవారు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) కనెక్షన్‌ను వెంటనే వదులుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (సరఫరా మరియు పంపిణీ నియంత్రణ) ఆర్డర్‌కు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై PNG కనెక్షన్ ఉన్నవారు ప్రభుత్వ చమురు కంపెనీల నుండి లేదా వారి పంపిణీదారుల నుండి సిలిండర్ రీఫిల్స్ తీసుకోకూడదని, అలాగే కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటికే రెండు కనెక్షన్లు కలిగి ఉంటే, గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ను వెంటనే సరెండర్ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే కొన్ని భారతీయ నౌకలకు ఇరాన్ అనుమతిని ఇచ్చింది. భారత్-ఇరాన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, పరస్పర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ 'ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026'లో వెల్లడించారు. ఇజ్రాయెల్-అమెరికా కూటమికి, ఇరాన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మార్చి మొదటి వారం నుండి ఈ మార్గం మూతపడింది.
శుక్రవారం రోజున 'శివాలిక్' మరియు 'నందా దేవి' అనే రెండు భారతీయ ఎల్‌పీజీ వాహక నౌకలను హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. భారత్ తన ఎల్‌పీజీ అవసరాలలో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుండగా, అందులో 85-90 శాతం సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల నుండి వస్తుంది. ఈ సరఫరా హార్ముజ్ జలసంధిపైనే ఆధారపడి ఉండటంతో, తాజా సంక్షోభం భారత్‌కు పెద్ద సవాలుగా మారింది.