కార్మికులకు గుడ్‌న్యూస్.. 40 దాటితే హెల్త్ చెకప్!
40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఇకపై ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరి కానున్నాయి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం 40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ...
By - అంజి |
కార్మికులకు గుడ్‌న్యూస్.. 40 దాటితే హెల్త్ చెకప్!
40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఇకపై ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరి కానున్నాయి. కొత్త కార్మిక చట్టాల ప్రకారం 40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల కార్మికుల సంక్షేమం పటిష్టమవడమే కాకుండా, రక్షిత శ్రామిక శక్తిని నిర్మించవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే.. దేశం బాగుంటుందని అన్నారు. మంగళవారం భారత్ మండపంలో జరిగిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని ఆసుపత్రుల్లో మందులు, పరికరాలు, వైద్యుల లభ్యతను పర్యవేక్షించాలని అధికారులను కోరారు. ఇన్-హౌస్ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ఇతర ఆసుపత్రులకు రెఫరల్స్ చేయడాన్ని తగ్గించాలని సూచించారు. "ఆరోగ్యమే సేవ - సేవయే మన సంస్కారం" అని పేర్కొంటూ, వైద్య నిపుణులు క్రమశిక్షణతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 1952లో కేవలం 1.2 లక్షల మంది లబ్ధిదారులతో ప్రారంభమైన ESIC, నేడు 15 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు, 166 ఆసుపత్రులు, 17 వైద్య కళాశాలల ద్వారా సేవలు అందిస్తోందని ఆయన కొనియాడారు.
ఈ ప్లాటినం జూబ్లీ వేడుకల గుర్తుగా 'ESIC@75' ప్రత్యేక నాణేన్ని మరియు కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఇదే వేదికపై రెండు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు (MoUs) జరిగాయి. ఒకటి, ఆయుష్మాన్ భారత్ (AB PM-JAY) పథకంతో ESICని అనుసంధానించడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకోగా, రెండోది ESIC ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ (NABL)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ కార్యదర్శి వందన గుర్నాని కూడా పాల్గొని, ఆరోగ్యవంతమైన శ్రామిక శక్తి దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముక అని పేర్కొన్నారు.