జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ నివాసం వద్ద ఓ ఆగంతుకుడు హల్‌చల్ చేశాడు. ఢిల్లీలోని దోవల్ ఇంట్లోకి కారుతో దూసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. భద్రతను ఉల్లంఘించిన ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ సెల్ విచారిస్తోంది. అయితే.. తన శరీరంలో ఎవరో చిప్ పెట్టారని, బయట నుంచి వారు తనను కంట్రోల్ చేస్తున్నట్లు అతడు చెప్పాడు.
అతడికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయగా.. అతడి శరీరంలో ఎలాంటి చిప్ లేదని తేలింది. అతడు బెంగళూరు చెందిన వాడని.. అతడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అద్దె కారులో అతడు డోవల్ నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఘటన జరిగిన సమయంలో డోవల్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఢిల్లీ పోలీసులు అజిత్ దోవల్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.