రెండేళ్లు ఫైవ్‌ స్టార్‌ హోటల్లో ఉన్నాడు.. బిల్లు మాత్రం కట్టలేదు!

ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రెండేళ్ల పాటు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోనే ఉన్నాడు. అది కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా. అవును..

By Srikanth Gundamalla  Published on  21 Jun 2023 4:50 PM IST
Five Star Hotel, Bill not Payed, 2 Years, Delhi

రెండేళ్లు ఫైవ్‌ స్టార్‌ హోటల్లో ఉన్నాడు..బిల్లు మాత్రం కట్టలేదు!

ఫైవ్‌ స్టార్‌ హోటల్లో ఉండాలని చాలా మంది కలలు కంటారు. కానీ అది అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే.. బాగా ఖర్చుతో కూడుకున్న పని. సంపన్నులైనా సరే ఏదో ఒకట్రెండు నెలలు.. బిజినెస్‌ మీటింగ్‌లు అయ్యే వరకు మాత్రమే ఉంటారు. ఏళ్ల తరబడి అంటే ఎవరూ ఉండరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రెండేళ్ల పాటు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోనే ఉన్నాడు. అది కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా. అవును ఇది నిజమే. రెండేళ్ల పాటు హోటల్‌లో బస చేసి తర్వాత డబ్బులు కట్టకుండా ఉడాయించాడు. అతనిపై హోటల్‌ నిర్వాహకులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సదురు వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు దగ్గర రోసేట్‌ హౌస్‌ ఉంది. అక్కడే జరిగిందీ ఈ ఘటన. అంకుష్‌ దత్తా అనే వ్యక్తి తమకు చెల్లించాల్సిన రెండేళ్ల బిల్లు కట్టకుండా ఉడాయించాడంటూ.. రోసేట్‌ హౌస్‌ను నిర్వహిస్తోన్న బర్డ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ హోటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. హోటల్‌లో అతడు దాదాపు 603 రోజులు ఉన్నాడని... 2019 మే 30న అంకుష్‌ దత్తా చెక్‌ అయ్యాడని తెలిపారు. ఆ తర్వాత 2021 జనవరి 22 వరకు హోటల్‌లోని ఓ గదిలో బస చేశాడని తెలిపారు. ఆ తర్వాత బకాయిపడ్డ రూ.58 లక్షల బిల్లు కట్టకుండా పరారీ అయ్యాడని ఫిర్యాదు చేశారు. మామూలుగా అయితే ఈ విషయం ముందే హోటల్‌ సిబ్బందికి తెలియాలి కానీ.. అంకుష్‌ దత్తా హోటల్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరిని మేనేజ్‌ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి సహకారంతోనే ఇన్నాళ్లు హెటల్లో బస చేశాడని చెబుతున్నాడు. అయితే..దత్తా వేర్వేరు తేదీల్లో మూడు చెక్కులు కూడా ఇచ్చాడు. అవి బౌన్స్‌ అయ్యాయని పోలీసులకు తెలిపారు హోటల్‌ నిర్వాహకులు.

Next Story