తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసం వద్ద బాంబులు పెట్టామని, మరికాసేపట్లో ఆ ఇంటిని పేల్చేస్తామని దమ్ముంటే ఆపుకోమని ఓ వ్యక్తి బుధవారం రాత్రి ఎగ్మూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సవాల్ విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీఎం నివాసం, కార్యాలయాలకు బాంబు స్క్వాడ్‌తో చేరుకున్నారు. విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయితే..ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అది ఫేక్ కాల్‌గా నిర్థారించుకున్నారు.
ఆ ఫోన్ చేసిందని ఎవరా అని పోలీసులు ఆరా తీశారు. అతడిని తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి గ్రామానికి చెందిన కె తామరై కన్నన్‌గా గుర్తించి అరెస్టు చేశారు. కాగా.. ఆ ఫోన్ కాల్ చేసినప్పుడు తాను మద్యం మత్తులో ఉన్నట్లు తామరై కన్నన్ పోలీసులకు వెల్లడించాడు. అయితే.. అతడికి గంజాయి అలవాటు ఉందని అతడి స్నేహితులు వెల్లడించారు. గంజాయి మత్తులోనే ఫోన్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. తదుపరి దర్యాప్తు చేపట్టారు.