హోం థియేట‌ర్ పేలుడులో వ‌రుడి మృతి.. గిఫ్ట్‌గా ఇచ్చింది వ‌ధువు మాజీ ప్రియుడే

హోం థియేట‌ర్ పేలుడులో వ‌రుడి మృతి చెందిన ఘ‌ట‌న‌ను పోలీసులు చేధించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2023 10:22 AM IST
Home Theatre blast, Kabirdham

పోలీసుల అదుపులో నిందితుడు



పెళ్లి కానుకగా అందుకున్నహోమ్ థియేటర్ మ్యూజిక్ సిస్టమ్ ప్లగిన్ చేయగానే పేలిపోవడంతో కొత్తగా పెళ్లయిన వ్యక్తి, అతని సోదరుడు సోమవారం మరణించారు. ఈ పేలుడులో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో చోటు చేసుకున్న‌ ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ మిస్ట‌రీని పోలీసులు చేధించారు. ప్ర‌మాదవ‌శాత్తు జ‌రిగిన ఘ‌ట‌న కాద‌ని, అది వధువు మాజీ ప్రియుడు బహుమతిగా ఇచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. త‌న‌ను కాద‌ని మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకుంద‌న్న కోపంతో.. వ‌ధువుతో పాటు ఆమె అత్తింటి కుటుంబాన్ని మొత్తాన్ని చంపాల‌ని ప్లాన్ చేసిన‌ట్లు పోలీసులు తేల్చారు.

ఓ యువ‌తితో 22 ఏళ్ల హేమేంద్ర మెరావి వివాహం ఏప్రిల్ 1న ఘ‌నంగా జ‌రిగింది. పెళ్లికి ప‌లు కానుక‌లు రాగా.. ఆ మ‌రుస‌టి రోజు వాటిని హేమేంద్ర‌, అత‌డి కుటుంబ స‌భ్యులు తీసి చూస్తున్నారు. హోం థియేట‌ర్‌ను అన్ బాక్స్ చేసి ప్ల‌గ్ ఇన్ చేసి స్విచాన్ చేయ‌గా పెద్ద శ‌బ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి హోమ్ థియేటర్ సిస్టమ్ ఉంచిన గది గోడలు, పైకప్పు కూలిపోయాయి. హేమేంద్ర మెరావి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా అత‌డి సోద‌రుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మ‌రో న‌లుగురు(ఏడాన్న‌ర బాలుడు) తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

హోమ్ థియేటర్ సిస్టమ్‌లో ఎవరో పేలుడు పదార్థాలు అమర్చడం వల్లే పేలుడు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. తరువాత, పోలీసులు వివాహం సందర్భంగా అందుకున్న బహుమతుల జాబితాను పరిశోధించడం ప్రారంభించినప్పుడు, హోమ్ థియేటర్ ను వధువు మాజీ ప్రేమికుడు బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు గుర్తించారు.

నిందితుడిని సర్జుగా గుర్తించిన పోలీసులు ఆ తర్వాత అత‌డిని అరెస్టు చేశారు. కబీర్‌ధామ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా ఠాకూర్ మాట్లాడుతూ.. విచారణలో నిందితుడు త‌న నేరాన్ని అంగీక‌రించిన‌ట్లు చెప్పారు. త‌న ప్రియురాలు త‌న‌ను కాద‌ని మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నందుకు అత‌డు కోపంతో ర‌గిలిపోయాడ‌ని, అందుకే పేలుడు ప‌దార్థాలు ఉంచిన హోమ్ థియేట‌ర్ ఆమెకు బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు చెప్పిన‌ట్లు తెలిపారు.

Next Story