ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని ప్రమాదం ఎదురైంది. వేటాడిన చేప నోటిలో చిక్కుకుపోవడంతో ఊపిరాడక అతను ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బంగ్రిపోసి పోలీస్ పరిధిలోని దిఘి గ్రామానికి చెందిన అవినాష్ బిజులీ అనే వ్యక్తి ఉదయం గ్రామ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనికి ఒక 'కౌ' (ఇండియన్ కోయి) చేప దొరికింది. అది చేతిలో నుంచి జారిపోకుండా ఉండేందుకు అవినాష్ ఆ బతికున్న చేపను తన నోటితో పట్టుకున్నాడు. అయితే, ఆ చేప ఒక్కసారిగా విదిలించుకుని అతని గొంతులోకి జారిపోయింది. శ్వాసనాళంలో చేప చిక్కుకుపోవడంతో అవినాష్‌కు శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
వెంటనే కుటుంబ సభ్యులు అతడిని బంగ్రిపోసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు సమాచారం. ఈ క్రమంలో స్థానిక వైద్యుల తీరుపై మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు చికిత్స అందించకుండా వైద్యులు దురుసుగా ప్రవర్తించారని, వేరే ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా బెదిరించారని అవినాష్ బాబాయ్ ఆరోపించారు. చేపలు పట్టే సమయంలో చిన్నపాటి అజాగ్రత్త ఒక ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా విషాదాన్ని నింపింది.