చనిపోయాడని భావించారు.. చితిపై నుండి కదలాడగా
చనిపోయాడని భావించిన వ్యక్తి కాస్తా చితిపై ప్రాణాలతో కదలాడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
By M.S.R Published on 1 Jun 2023 7:45 PM ISTచనిపోయాడని భావించారు.. చితిపై నుండి కదలాడగా
చనిపోయాడని భావించిన వ్యక్తి కాస్తా చితిపై ప్రాణాలతో కదలాడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మోరెనా శ్మశానవాటికలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. చితి మీద వ్యక్తి కదిలిన వెంటనే భయంతో ప్రజలు పరిగెత్తడం ప్రారంభించారు. ఆ వ్యక్తి బతికే ఉన్నాడని తెలుసుకున్న వెంటనే డాక్టర్‌ని పిలిచారు. జీతు ప్రజాపతి అనే యువకుడు చాలా కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పోరాడుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
కొందరు వ్యక్తులు అతని ముక్కు, నోటిపై వేళ్లను ఉంచి శ్వాస తీసుకుంటున్నాడా.. లేదా అనేది తెలుసుకోడానికి ప్రయత్నించారు. ఎటువంటి స్పందన లేకపోవడంతో అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నారు. అతను ఇక లేడని వారు భావించి అతని మృతదేహానికి దహన సంస్కారాలకు సిద్ధం చేశారు. అతని బంధువులు, పొరుగువారిని పిలిపించి అతని అంతిమ యాత్రను నిర్వహించారు. అతడిని శాంతి ధామ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలు జరుగుతూ ఉండగా అకస్మాత్తుగా శరీరం కదలడం ప్రారంభించింది. వెంటనే ప్రజలంతా అక్కడి నుండి పారిపోయారు. కొందరు ధైర్యం చేసి.. వైద్యుడిని పిలిపించారు. డాక్టర్ అతడిని తనిఖీ చేసిన తర్వాత, గుండె ఇంకా కొట్టుకుంటుందని నిర్ధారించారు. తదుపరి చికిత్స కోసం ఆ వ్యక్తిని గ్వాలియర్‌కు తరలించారు.