పంజాబ్: మొరిండాలోని గురుద్వారా వద్ద అపవిత్రానికి పాల్పడినందుకు పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన జస్వీర్ సింగ్ జస్సీ సోమవారం మరణించాడు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఛాతీ నొప్పి రావడంతో జస్సీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జస్సీ చనిపోయాడు. జస్వీర్ సింగ్ రూప్‌నగర్ జిల్లాలోని మొరిండాలోని గురుద్వారా కొత్వాలి సాహిబ్ గర్భగుడిలోకి ప్రవేశించడం, ఇద్దరు గ్రంథులను (పూజారి) కొట్టడం, సిక్కు మత గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేయడం వంటి వీడియో వైరల్ కావడంతో ఏప్రిల్ 24న అరెస్టు చేశారు.
అతని అరెస్టు తర్వాత, జస్వీర్ సింగ్‌ను ఏప్రిల్ 27న రూపనగర్‌లోని కోర్టు ముందు హాజరుపరిచారు, అయితే అక్కడ ఒక వ్యక్తి రివాల్వర్‌తో అతనిపై దాడికి ప్రయత్నించాడు . ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జస్వీర్ సింగ్‌ను ఏప్రిల్ 29న రూప్‌నగర్ నుంచి మాన్సా జైలుకు తరలించారు. పోలీసు వర్గాల ప్రకారం.. జస్వీర్ సింగ్ ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నాడని ఫిర్యాదు చేయడంతో మాన్సాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వల్ల జస్వీర్ సింగ్ మరణించాడని సివిల్ ఆసుపత్రిలోని డాక్టర్ ఇషాన్ తెలిపారు.
జస్వీర్ సింగ్ మృతదేహాన్ని సివిల్ ఆసుపత్రిలో ఉంచారు. తదుపరి విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.