దీదీ వర్సెస్ రాష్ట్రపతి: నేను గాలిపటం దారాన్ని కాదంటూ మమతా బెనర్జీ ఫైర్!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్య తలెత్తిన తాజా వివాదం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
By - అంజి |
దీదీ వర్సెస్ రాష్ట్రపతి: నేను గాలిపటం దారాన్ని కాదంటూ మమతా బెనర్జీ ఫైర్!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్య తలెత్తిన తాజా వివాదం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇటీవల డార్జిలింగ్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తన పర్యటనలో ప్రోటోకాల్ లోపాలు జరిగాయని అసహనం వ్యక్తం చేశారు. బిధాన్‌నగర్ నుంచి గోషాయిపూర్‌కు తన పర్యటన స్థలాన్ని మార్చడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. దీనివల్ల ప్రజల హాజరు తక్కువగా ఉందని, అలాగే తన గౌరవార్థం జరిగిన గిరిజన సమ్మేళనానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గానీ, ఆమె మంత్రులు గానీ హాజరుకాకపోవడంపై రాష్ట్రపతి విస్మయం వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ వివరణ:
రాష్ట్రపతి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా స్పందించారు. ఈ కార్యక్రమాన్ని 'ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్' అనే ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిందని, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రపతి సెక్రటేరియట్ ఆమోదించిన అధికారిక షెడ్యూల్‌లో తన పేరు గానీ, రాష్ట్ర మంత్రుల పేర్లు గానీ లేవని మమతా పేర్కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సిలిగురి మేయర్, డార్జిలింగ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ రాష్ట్రపతికి స్వాగతం పలికి, వీడ్కోలు పలికారని.. ఇందులో ఎటువంటి ప్రోటోకాల్ లోపం జరగలేదని ఆమె తేల్చి చెప్పారు.
ఆధారాలతో సహా కౌంటర్:
వేదిక మార్పుపై స్పందిస్తూ.. ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో సరైన ఏర్పాట్లు లేవని జిల్లా యంత్రాంగం రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు ముందే లిఖితపూర్వకంగా తెలియజేసిందని మమతా గుర్తుచేశారు. ఈ మేరకు కార్యక్రమానికి రెండు రోజుల ముందు అక్కడ ఏ నిర్మాణాలు లేని ఖాళీ మైదానానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. రాష్ట్రపతి సెక్రటేరియట్ బృందం మార్చి 5న స్వయంగా పరిశీలించిన తర్వాతే కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం జరిగిందని తెలిపారు.
రాజకీయ విమర్శలు:
ఈ వివాదాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. "ఎన్నికల సమయంలో పదేపదే పర్యటనలకు వస్తే, ప్రతిసారీ మీ వెంటే తిరగడం మాకు సాధ్యం కాదు. మేమేమైనా గాలిపటం వెనుక ఉండే దారం అనుకుంటున్నారా?" అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రపతిని గౌరవిస్తామని, అయితే ఆమె బీజేపీ విధానాలకు అనుగుణంగా వ్యవహరించడం విచారకరమని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.