జీ-20 సదస్సుపై.. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం
Mamata, Stalin to attend all-party meet on G20 presidency. న్యూఢిల్లీ: డిసెంబర్ 1, 2022 నుండి ఒక సంవత్సరం పాటు జీ-20 అధ్యక్ష పదవిని భారత్
By అంజి Published on 5 Dec 2022 9:00 AM ISTన్యూఢిల్లీ: డిసెంబర్ 1, 2022 నుండి ఒక సంవత్సరం పాటు జీ-20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన నేపథ్యంలో.. రాజకీయ పార్టీల అధినేతలు నేడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకానున్నారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే సమావేశానికి హాజరయ్యే వారిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బిజు జనతా దళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. ''నేను నేతలందరితోనూ, పార్టీ అధ్యక్షులతోనూ వ్యక్తిగతంగా మాట్లాడాను. అయితే ప్రస్తుతానికి కేసీఆర్‌తో సహా కొంతమంది నాయకుల నుండి మాకు ఎటువంటి ధృవీకరణ లేదు'' అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ''ఇది పార్టీ అధ్యక్షులను మాత్రమే ఆహ్వానించిన సమావేశం కాబట్టి హాజరు కావాలని మేము వారిని అభ్యర్థించాము. అధ్యక్షుల తరపున ప్రతినిధులెవరూ హాజరుకారు'' అని జోషి తెలిపారు.
టీఆర్‌ఎస్‌కు చెందిన కే కేశవరావు మాట్లాడుతూ.. ''నేటి సమావేశానికి మా నాయకుడు హాజరు అవుతారనే సమాచారం మాకు లేదు'' అని అన్నారు. సోమవారం నాటి సమావేశానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అందుబాటులో లేరని ఇప్పటికే కేంద్రానికి తెలియజేశారు. ''భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు కాబట్టి మేము ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కాలేము'' అని వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి చెప్పారు.
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం సింగపూర్‌లో వైద్య చికిత్స పొందుతున్నందున ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరవుతున్నారో లేదో ఇప్పటి వరకు జనతాదళ్ (యునైటెడ్) నుండి ప్రభుత్వానికి ఎటువంటి ధృవీకరణ లేదు. ముఖ్యంగా ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించే అవకాశం ఉంది. ఇంకా ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రాజ్యసభలో హౌస్ లీడర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సమన్వయం చేస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో.. భారతదేశం కోసం జీ20 అధ్యక్ష పదవి, రాబోయే సంవత్సరానికి దాని అర్థం ఏమిటో రాజకీయ పార్టీల కోసం వివరణాత్మక ప్రదర్శన ఇవ్వబడుతుంది. భారత అధ్యక్షతన తొలి జి20 షెర్పా సమావేశం ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రారంభమైంది. వచ్చే ఏడాదిలో భారతదేశంలోని 55 నగరాల్లో జరిగే 200 సమావేశాలలో ఇది మొదటిది. ఇండోనేషియా ఈ నెల ప్రారంభంలో బాలి సమ్మిట్‌లో వచ్చే సంవత్సరానికి ప్రధాని మోదీ సమక్షంలో జీ20 అధ్యక్ష పదవిని భారతదేశానికి అప్పగించింది. జీ20 లేదా గ్రూప్ ఆఫ్ 20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి జి20 అధ్యక్ష పదవిని భారత్ అధికారికంగా స్వీకరించింది.