దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది మరణించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట కరోనా మహమ్మారి విషాదం నింపింది. ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా బారినపడి కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆషీమ్ బెనర్జీ కోల్‌కతాలోని మెడికా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి చైర్మన్ అలోక్‌రాయ్ పేర్కొన్నారు.
ఇటీవల ఆషీమ్ బెనర్జీలో కరోనా లక్షణాలు కనిపించడంతో మెడికా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు పూర్తిస్థాయి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందారు. కాగా.. కరోనా నిబంధనల మధ్య మధ్యాహ్నం అంత్యక్రియలు నిమ్తలా మహా శ్మశాన్ ఘాట్‌లో జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆషీమ్ బెనర్జీ మృతితో సీఎం మమతా బెనర్జీ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆషీమ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇదిలా ఉంటే.. వెస్ట్ బెంగాల్ లో గడిచిన 24 గంటల్లో 20,846 కొత్త కరోనా కేసులు నమోదవగా.. 136 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10, 94,802 కు చేరగా 12,993 కరోనా మరణాలు సంభవించాయి