పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి మొదలైన సంగతి తెలిసిందే..! అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో ఉన్న ఓ హామీ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూ ఉంది. అదేమిటంటే ఒక్కో కుటుంబానికి ప్రత్యక్షంగా నగదు ఇవ్వడం.. జనరల్ కేటగిరీలో కుటుంబానికి 500.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు 1000 రూపాయలు ఇవ్వనున్నారట..! ఆర్థికంగా వెనుకబడ్డ అందరికీ దీన్ని అందిస్తామని తృణమూల్ కాంగ్రెస్ చెబుతోంది. తిరిగి అధికారంలోకి వస్తే- జనరల్ కేటగిరీ ప్రజలకు నెలకు రూ 500 చొప్పున, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నెలకు రూ 1000 చొప్పున అందజేస్తామని దీదీ వరాలు కురిపిస్తూ ఉంది.
ఇంటి మహిళ బ్యాంకు అకౌంటుకు నగదు నేరుగా జమ చేస్తామని.. ప్రతీ కుటుంబానికీ కనీస నెలసరి ఆదాయాన్ని సమకూర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపింది. రాష్ట్రంలో కోటీ 60 లక్షల మంది దాకా జనరల్ కేటగిరీ ప్రజలున్నారు. వీరికి ఏటా రూ 6000 దాకా లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు రూ 12,000 లభిస్తుందని తెలిపారు. ఈ నగదు పంపిణీ కుల, మతాలకు అతీతంగా జరుగుతుందని వెనుకబాటుతనాన్ని నిర్మూలించటమే ముఖ్యమని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత మమతా బెనర్జీ ఈ మేనిఫెస్టో విడుదల సమయంలో చెప్పుకొచ్చారు.
వెనుకబడ్డ విద్యార్థులు రూ 10 లక్షల దాకా రుణాన్ని తీసుకుని ఉన్నత విద్యను కొనసాగించుకోడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై కేవలం 4 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డున్న ప్రతీ కుటుంబానికీ నెలసరి రేషన్‌ను ఉచితంగా ఇంటికే పంపే ఏర్పాటు చేయనున్నట్లు కూడా మమత తెలిపారు. ఏటా 5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది తృణమూల్ కాంగ్రెస్. చిన్న, మధ్యతరహా రైతులకు ప్రస్తుతం ఏడాదికి ఎకరాకు ఇస్తున్న 6000 రూపాయల నగదుసాయాన్ని రూ 10,000 కు పెంచుతున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.