అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 'మా కిచెన్' సెంటర్లను వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదలకు కడుపునిండా భోజనం పెట్టడమే ఈ పథకం లక్ష్యమన్నారు. ప్రస్తుతానికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో 'మా కిచెన్లు' ప్రారంభించామని.. త్వరలో ఈ సెంటర్లను మరింతగా పెంచుతామని చెప్పారు. ఈ సెంటర్లలో కేవలం రూ. 5కే భోజనం చేయవచ్చని తెలిపారు.
మధ్యాహ్న భోజనంగా అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డు కూర రూ.5 కే అందివ్వనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్వయం సహాయక బృందాలు వంటశాలలను నిర్వహించనున్నాయి. మీల్స్ ఒక్కింటికి రూ.15 రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మా కిచెన్ సెంటర్లతో పలువురికి ఉపాథి అవకాశాలు కలుగుతాయని, ప్రజలకు ఉచిత రేషన్, ఉచిత ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్యను అందించే ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 10 కోట్ల మంది స్వస్థ సతీ కార్డు లబ్ధి పొందారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కేన్సర్ పేషంట్ల గుర్తింపు, చికిత్స, రిజిస్ట్రేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌ను కూడా మమత ప్రారంభించారు. కాగా, రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి.