జోడో యాత్రపై రాహుల్‌దే తుది నిర్ణయం: ఖర్గే

ఢిల్లీలో సీడబ్ల్యూ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  21 Dec 2023 4:00 PM GMT
mallikarjun kharge, cwc meeting, delhi,

 జోడో యాత్రపై రాహుల్‌దే తుది నిర్ణయం: ఖర్గే

ఢిల్లీలో సీడబ్ల్యూ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పందించిన ఆయన.. ఆ ఫలితాల నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నామని అన్నారు. ఆ అనుభవాలతోనే 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం కావడంతో.. ప్రధానంగా ఎన్నికల గురించే చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎలా ముందుకువెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో అధికార పార్టీ వ్యవహారంపై మల్లికార్జున ఖర్గే అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో చర్చ లేకుండానే కీలకమైన బిల్లులను ఏకపక్షంగా ఆమోదిస్తున్నారని చెప్పారు. దీని ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుని దేశం మొత్తం చూస్తోందని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తాము కొంతమేర నిరాశ చెందామని మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే.. ఆ ఎన్నికల్లో చేసిన తప్పులపై సమీక్షించుకుంటామని చెప్పారు. తద్వారా విలువైన పాఠాలు నేర్చుకుని.. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతామని చెప్పారు. పొరపాట్లు మళ్లీ రిపీట్‌ అవ్వకుండా మున్ముందు జాగ్రత్తపడతామని చెప్పారు మల్లికార్జున ఖర్గే.

అయితే.. లోక్‌సభ ఎన్నికలు కూడా ఎంతో దూరంలో లేవని మల్లికార్జున ఖర్గే అన్నారు. అందరూ కార్యాచరణపై దృష్టి సారించాలని పార్టీ నేతలను ఖర్గే కోరారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత భారత్‌ జోడో యాత్ర గురించి మాట్లాడిన ఖర్గే.. మరోసారి పాదయాత్ర చేయాలని అందరూ కోరుతున్నారని అన్నారు. అయితే.. జోడో యాత్ర చేపట్టడం అనేది రాహుల్‌గాంధీ నిర్ణయం అని.. ఆయనే డిసైడ్‌ చేసుకుంటారని అన్నారు. కాగా.. ఈ సీడబ్ల్యూసీ సమావేవంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్‌ నాయకులంతా పాల్గొన్నారు.

Next Story