పార్లమెంట్‌ ఎలక్షన్స్‌కు ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీస్ కాదు: ఖర్గే

ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కాదన్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

By Srikanth Gundamalla  Published on  25 Oct 2023 1:30 PM IST
mallikarjun kharge,  5 states election, congress,

 ఐదు రాష్ట్రాల ఎన్నికలు పార్లమెంట్‌ ఎలక్షన్స్‌కు సెమీస్ కాదు: ఖర్గే

త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కొద్ది నెలలకే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ అనే టాక్‌ నడుస్తోంది. ఇదే అంశంపై తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కాదని చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం ఎన్నికలు జరగబోయే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో వేర్వేరు పరిస్థితులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికలు..ఈ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భిన్నమైనవని మల్లికార్జున ఖర్గే చెప్పారు..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం కర్ణాటకలోని తన సొంత జిల్లా కలబుర్గిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పదించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై వ్యతిరేకత ఉందని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లోటుతో ప్రజలు విసిగిపోయారన్నారు. అయితే.. చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు మెరుగైన పాలనను అందిస్తున్నాయని, ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు సమస్యలు లేనవి ఖర్గే అన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్‌ సన్నహాలు చేస్తోందని ఖర్గే చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో తామే గెలుస్తామంటూ ఆయన దీమా వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై బీజేపీపై వ్యతిరేకత ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని శివారాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. ఏ వాగ్దానాలు చేసినా.. ఒక్కటీ నెరవేర్చనీ పార్టీ బీజేపీనే అంటూ ఫైర్ అయ్యారు. కర్ణాటకను కాంగ్రెస్ ఎన్నికల కోసం ఏటీఎంగా మార్చుకుంటోందన్న ఆరోపణలను ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ పార్టీని దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. ఇక ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

కాగా.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా మిజోరంలో నవంబర్‌ 7న, చత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17వ తేదీల్లో, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్లో 25న, తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 3 అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ జరగనుంది.

Next Story