భార‌త్‌లో రేప‌టి నుంచి ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప‌నిచేయ‌వా..?

Major Social Media Firms Yet To Comply With Govt Rules.సోష‌ల్ మీడియా దిగ్గ‌జాలు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ల‌పై క‌త్తి వేలాడుతోంది. బుధ‌వారం నుంచి ఈ సేవ‌లు నిలిచిపోయే అవ‌కాశం ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2021 5:16 AM GMT
social media firms

సోష‌ల్ మీడియా దిగ్గ‌జాలు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ల‌పై క‌త్తి వేలాడుతోంది. బుధ‌వారం నుంచి ఈ సేవ‌లు నిలిచిపోయే అవ‌కాశం ఉంది. సామాజిక, డిజిటల్‌ మాధ్యమాల్లోని కంటెంట్‌ను నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో 'కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌' పేరిట కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది.

సోష‌ల్ మీడియాలో తమతమ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్‌ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలి. అలాగే, వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్‌ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయా న్ని వారికి తెలియజేయాలి. 15 రోజుల్లోగా పరిష్కరించాలి. సోషల్‌ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం 'చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారి'ని నియమించాలి. పోలీసులు, సీబీఐ వంటి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండే లా 'నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌'ను నియమించాలి. ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్‌ గ్రీవన్స్‌ అధికారిని నియమించాలి. వీరంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి. ఇలా కొన్ని నిబంధనలను కేంద్రం విధించింది.

ఆ మార్గ‌ద‌ర్శ‌కాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవ‌డానికి సామాజిక మాధ్య‌మాల‌కు. ఓటీటీల‌కు మే 25ను డెడ్ లైన్‌గా నిర్ణ‌యించింది. కాగా.. ఆ గ‌డువు నేటితో ముగియ‌నుంది. అయితే ప్రముఖ సామాజిక దిగ్గజాలు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధనల అమలుకు ప్రభుత్వం మూడు నెలల సమయమివ్వగా.. ఆయా సంస్థలు మాత్రం ఆరు నెలల సమయం అడుగుతున్నాయి. దీనికి కేంద్రం ససేమిరా అంటోంది. దీంతో బుధవారం నుంచి సోషల్‌ మీడియా సైట్లు, ఓటీటీలు బంద్‌ అవుతాయా? అన్న చర్చ మొదలైంది.

Next Story
Share it