కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం నేడు తుపాకుల మోతతో దద్దరిల్లింది.

By -  అంజి
Published on : 19 Feb 2026 12:17 PM IST

Karregutta Encounter, Operation-2 Kagar, Maoists Killed, Chhattisgarh Naxal News, CRPF Operation

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం నేడు తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టిన 'ఆపరేషన్-2 కగార్' లో భాగంగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు అగ్రశ్రేణి మావోయిస్టులు మృతి చెందారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఆపరేషన్‌లో సీఆర్‌పీఎఫ్ (CRPF), కోబ్రా (CoBRA) మరియు డీఆర్‌జీ (DRG) బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో బలగాలు ఈ ఉదయం నుంచే కూంబింగ్ ప్రారంభించాయి. అడవిలో గాలింపు జరుపుతున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మరణించగా, అడవిలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం ఆపరేషన్ ప్రధానంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత దేవ్ జీ లక్ష్యంగా సాగుతోంది. దేవ్‌ జీ ఈ ప్రాంతంలోనే తలదాచుకున్నాడన్న సమాచారంతో బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. ఆయనను పట్టుకుంటే మావోయిస్టు యంత్రాంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను బలగాలు గుర్తించాయి. ఘటనా స్థలంలో అత్యాధునిక ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అడవిలో గాలింపు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Next Story