మహారాష్ట్ర 'లేడీ సింగమ్' ఆత్మహత్య.. ప్రకంపనలు సృష్టిస్తున్న సూసైడ్ నోట్.. ఉప ముఖ్యమంత్రి ఎమన్నారంటే..?
Maharashtra's 'Lady Singham' found dead.అటవీ మాఫియాకు ముచ్చెమటలు పట్టించి వారి పాలిట సింహస్వప్నంగా మారి లేడి
By తోట వంశీ కుమార్ Published on 27 March 2021 4:09 AM GMTఅటవీ మాఫియాకు ముచ్చెమటలు పట్టించి వారి పాలిట సింహస్వప్నంగా మారి 'లేడి సింగమ్'గా గుర్తింపు పొందింది మహారాష్ట్ర అటవీ అధికారి దీపాలి చవాన్(28). అయితే.. ఆమె ఆత్మహత్యకు పాల్పడడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఓ ఉన్నతాధికారి తనను లైంగికంగా తీవ్ర వేదింపులకు గురి చేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన నాలుగు పేజీల సూసైట్ నోట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాఫియాకే చుక్కలు చూపించిన ఆమె.. ఓ ఉన్నతాధికారి వేదింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం అందరిని కలచివేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. మెల్గాట్ టైగర్ రిజర్వు(ఎంటీఆర్) సమీపంలోని హరిసాల్ గ్రామంలోని తన అధికారిక నివాసంలో గురువారం రాత్రి ఆమె తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుంది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త రాజేశ్ మొహితే చిఖల్‌ధారలో ట్రజరీ అధికారి. కాగా.. దీపాలి తల్లి ఆమెతోనే ఉండేది. అయితే.. ఆమె(దీపాలి తల్లి) తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో దీప బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలంలో ఆమె రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోటు లభ్యమైంది. అందులో అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్(డీసీఎఫ్) శివకుమార్ తనతో గడపాలని.. అలా చేయకపోతే అదనపు డ్యూటీలు వేయడం.. వేధించడం చేసేవాడని వాపోయింది.
ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో గర్భవతి ఉన్న దీపాలీని మూడు రోజుల పాటు పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉందంటూ శివకుమార్ తనతో పాటు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లాడని రాసింది. గర్భిణి అని తెలిసి కూడా కిలోమీటర్ల దూరం నడిపించాడని.. దీంతో గర్భస్త్రావం కావడంతో దీపాలీ తీవ్ర మనోవేదనకు గురైంది. కొన్ని నెలలుగా ఆయన లైంగికంగా ఎలా వేదించాడో ఆ విషయాలను పూసగుచ్చినట్టు లేఖలో రాసింది. మానసికంగా కూడా చిత్రహింసలకు గురి చేశాడని వాపోయింది.
ఆమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న వినోద్ శివకుమార్ పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని నిందితులను వదిలిపెట్టబోమన్నారు. నిందితుడు శివకుమార్‌ను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.