శుభ‌వార్త‌.. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తొలి భారతీయుడు

Maharashtra's first Omicron patient discharged.ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 6:08 AM GMT
శుభ‌వార్త‌.. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తొలి భారతీయుడు

ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ దేశాల‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. డెల్టా వేరియంట్ కంటే ఆరు రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతూ.. ఇప్ప‌టికే 56 దేశాల‌కు పాకింది. ఇక మ‌న‌దేశంలోనూ 23 మంది ఈ కొత్త వేరియంట్ బారిన ప‌డ్డారు. కాగా.. ఈ వేరియంట్ బారిన ప‌డిన తొలి వ్య‌క్తి మ‌హారాష్ట్ర‌లో కోలుకున్నాడు. అత‌డికి నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రావ‌డంతో బుధ‌వారం అత‌డిని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కూడా చేశారు.

థానే జిల్లాకు చెందిన 33 సంవత్సరాల వ్యక్తి వృత్తిరీత్యా మెరైన్‌ ఇంజినీర్‌. కల్యాణ్‌లోని డోంబివిలి మున్సిపల్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత నెల 24న దక్షిణాఫ్రికా నుంచి దుబాయి మీదుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అత‌డికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఒమిక్రాన్‌గా నిర్థార‌ణ అయ్యింది. సదరు వ్యక్తి ఏప్రిల్‌లో ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన షిప్‌లో చేరాడు. అప్పటి నుంచి సముద్ర ప్రయాణంలో ఉండగా.. కొవిడ్‌ టీకా తీసుకోలేదని అధికారులు తెలిపారు.

కాగా.. తాజాగా అత‌డికి నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ గా వ‌చ్చింద‌ని, ప్ర‌స్తుతం అత‌డిని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపిన‌ట్లు కల్యాణ్‌ డోంబివిలి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కేడీఎంసీ) కమిషనర్‌ డాక్టర్‌ సూర్యవంశీ తెలిపారు. మ‌రో ఏడు రోజుల వ‌ర‌కు క్వారంటైన్‌లో ఉండాల‌ని అత‌డికి సూచించిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా.. మ‌హారాష్ట్ర‌లో ఇప్పటి వరకు 10 ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story