తీవ్ర విషాదం.. పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృతి

మహారాష్ట్రలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  10 April 2024 1:44 PM IST
maharashtra, tragedy, five people death,  cat,

 తీవ్ర విషాదం.. పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృతి

మహారాష్ట్రలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో బావిలో పడిపోయిన పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించి.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. మృతుంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానకింగా విషాద చాయలు అలుముకున్నాయి.

ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో బావిలో కాపాడేందుకు కుటుంబంలోని ఒకరు బావిలోకి దిగారు. అయితే.. ఆ బావిని బయోగ్యాస్‌ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా బావిలోకి దిగిన వారు బయటకు రాకపోవడంతో మరొకరు అందులోకి దిగారు. అలా ఒకరిని మరొకరు కాపాడేందుకు దిగి మొత్తం ఆరుగురు బావిలోకి దిగారు. అయితే.. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి చివరగా దిగిన వ్యక్తిని మాత్రం స్థానికులు కాపాడారు. ఇక మిగతా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాదకర సంఘటనపై అహ్మద్‌నగర్‌లోని నెవాసా పోలీస్‌ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్‌ జాదవ్ మాట్లాడారు. పిల్లిని కాపాడే క్రమంలో బయోగ్యాస్‌ కోసం ఉపయోగిస్తున్న బావిలోకి ఒకరి తర్వాత మరొకరు దిగారని చెప్పారు. ఆరుగురు బావిలోకి దిగగా ఐదుగురి మృతదేహాలను బయటకు తీసినట్లు ఆయన వెల్లడించారు. ఇక నడుముకి తాడు కట్టుకుని దిగడం వల్ల చివరగా దిగిన ఆ వ్యక్తిని మాత్రం ప్రాణాలతో స్థానికులు బయటకు తీశారని చెప్పారు. ఇక అతని పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో.. పోలీసులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్టున్నట్లు పోలీసు అధికారి చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి ధనంజయ్‌ జాదవ్ చెప్పారు.

ఇక చనిపోయిన వారిని పోలీసులు గుర్తించారు. మృతులు మాణిక్‌ కాలే (65), మాణిక్‌ కుమారుడు సందీప్ (36), అనిల్‌ కాలే (53), అనిల్‌ కుమారుడు బబ్లూ (28), బాబా సాహెబ్‌ గైక్వాడ్‌ (36)గా గుర్తించారు. ఇక ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి మాణిక్‌ చిన్నకుమారుడు విజయ్‌ (35)గా పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం అర్ధరాత్రి వరకు మృతదేహాలను బయటకు తీశారు.


Next Story