పోలీసుల కాల్పుల్లో ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన నిందితుడు మృతి
maharashtra, rape accused, died, police firing,
By Srikanth Gundamalla Published on 23 Sep 2024 3:30 PM GMTమహారాష్ట్రలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసిన వ్యక్తి పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. అయితే.. అరెస్టయిన అక్షయ్ షిండే అనే వ్యక్తి సోమవారం పోలీసు అధికారి ఆయుధాన్ని లాక్కొని పోలీసులపై కాల్పులు జరపడంతో పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా నిందితుడు షిండే ఓ అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కొని కాల్పులు జరిపాడు. అనేక రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ సమయంలో పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. విచారణ కోసం నిందితుడిని తలోజా జైలు నుంచి బద్లాపూర్‌కు తీసుకువెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షిండే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఐదు రోజుల క్రితం పాఠశాల టాయిలెట్‌లో నాలుగు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించినందుకు షిండేను ఆగస్టు 17 న అరెస్టు చేశారు పోలీసులు. ఆ ప్రాంతంలో జరిగిన నిరసనల మధ్య ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. షిండే పాఠశాలలో క్లీనర్‌గా పనిచేసేవాడు. స్థానిక పోలీసులు మొదట ఈ కేసును విచారించారు. అయితే పోలీసుల దర్యాప్తులో తీవ్రమైన లోపాలపై ప్రజల నిరసన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఘటనపై తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ స్కూల్ చైర్మన్, సెక్రటరీపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిద్దరు ముందస్తు బెయిల్ కోసం సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు..