ఒకే నెలలో రూ.3కోట్లు సంపాదించిన టమాటా రైతు

పూణెలోని ఓ రైతు ఒకే నెలలో టమాటాలు అమ్మి ఏకంగా రూ.3 కోట్లు సంపాదించాడు.

By Srikanth Gundamalla  Published on  20 July 2023 5:01 AM GMT
Maharashtra, Pune, Tomato Farmer, Rs 3 Crores,

ఒకే నెలలో రూ.3కోట్లు సంపాదించిన టమాటా రైతు

కొన్నాళ్లుగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులు కూరగాయల మార్కెట్‌ వెళ్లి టమాటాలు కొంటే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇది ఒక వైపు అయితే మరోవైపు టమాటా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. పంట బాగా పండి చేతికొచ్చిన వారు అధిక లాభాలు గడించి లక్షలాధికారులు అవుతున్నారు. తాజాగా పూణెలోని ఓ రైతు ఒకే నెలలో టమాటాలు అమ్మి ఏకంగా రూ.3 కోట్లు సంపాదించాడు. కోటీశ్వరుడు అయ్యాడు.

మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని జున్నార్‌ తాలూకా పచగఢ్‌ గ్రామాని చెందిన రైతు ఈశ్వర్ గైకార్ (36). చాలా కాలంగా ఇతను తన పొలంలో టమాటా పండిస్తున్నాడు. పెద్ద మొత్తంలో పండించడం ద్వారా గతంలో చాలా నష్టపోయాడు. అయినా అలుపెరగకుండా 12 ఎకరాల పొలంలో టమాటా సాగు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా టమాటా వేశాడు. అయితే.. ప్రస్తుతం టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక పూణెలో అయితో కిలో టమాటా రూ.150 నుంచి రూ.200 వరకు పలికింది. దీంతో.. రైతు ఈశ్వర్‌ గైకార్‌ కలిసివచ్చింది. గత నెల రోజుల్లో రైతు ఈశ్వర్‌ ఏకంగా రూ.3 కోట్లు సంపాదించాడు. జూన్‌ 11 నుంచి జూలై 18 తేదీల మధ్య తనకు వచ్చిన పంట దిగుబడిని విక్రయించడం ద్వారా ఈ భారీ మొత్తం లాభాన్ని గడించి కోటీశ్వరుడు అయ్యాడు.

18వేల డబ్బాలను విక్రయించానని, ఇప్పటి వరకు రూ.3 కోట్లు అర్జించినట్లు రైతు ఈశ్వర్‌ తెలిపాడు. జూన్ 11 నుంచి ఒకకో ట్రేట్‌ ధర రూ.770 ఉంటే.. జూలై 18న రూ.2,200కు విక్రయించినట్లు చెప్పాడు. అయితే.. గతంలో చాలా సందర్భాల్లో గిట్టుబాటు ధర కూడా రాలేదని చెప్పాడు. మే నెలలో అయితే టమాటాలను రోడ్లపైనే పారబోశానని తెలిపాడు. ప్రస్తుతం ఇంత పెద్ద మొత్తంలో లాభాలు రావడం సంతోషంగా ఉందని రైతు ఈశ్వర్ గైకార్‌ చెప్పాడు.


Next Story