ఓ నిజాయితీగల అధికారి 70వేల షర్టు.. పాతిక లక్షల పైన విలువుండే వాచ్ ఎలా వాడుతాడు..?

Maharashtra Minister intensifies allegations against NCB officer. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే పేరు ఇటీవల బాగా పాపులర్

By M.S.R  Published on  3 Nov 2021 12:08 PM IST
ఓ నిజాయితీగల అధికారి 70వేల షర్టు.. పాతిక లక్షల పైన విలువుండే వాచ్ ఎలా వాడుతాడు..?

నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే పేరు ఇటీవల బాగా పాపులర్ అయింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసిన అధికారి సమీర్. ఆయనపై పెద్ద ఎత్తున లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సమీర్ పై సంచలన ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. వాంఖడే నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం సంపాదించారని ఆరోపించారు. వాంఖడే మొదటి వివాహానికి సంబంధించిందంటూ ఓ ఫొటోను కూడా ట్వీట్​​ చేశారు. తాను చేసిన ట్వీట్​లు అసత్యం అని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని నవాబ్​ మాలిక్ సవాల్​ విసిరారు. అయితే సమీర్ వాంఖడే రాజీనామా చేయకున్నా.. చట్ట ప్రకారమే ఉద్యోగం పోతుందని గతంలో చెప్పుకొచ్చారు.

తాజాగా సమీర్ వాంఖెడే రూ.70 వేల విలువైన షర్టు, రూ.25–50 లక్షల విలువైన వాచీలు వాడుతుంటారని ఆరోపించారు. నీతి నిజాయితీగల ఒక అధికారి అంతటి ఖరీదైన వస్తువులు ఎలా కొనుక్కోగలడని ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసుల్లో ప్రముఖుల్ని తప్పుడుగా ఇరికించి వారి నుంచి కోట్లు దండుకోవడమే అతను చేస్తున్న పని అని ఆరోపించారు. డ్రగ్స్‌ కేసుల్లో ఇరికించడానికి ఎన్‌సీబీకి ఒక ప్రైవేటు బృందం ఉందని మాలిక్‌ ఆరోపించారు. బాలీవుడ్‌ను మహరాష్ట్ర నుంచి త‌రిమేసేందుకే బీజేపీ కుట్ర‌పూరితంగా డ్ర‌గ్స్‌ కేసును వాడుకుంటోందని మంత్రి న‌వాబ్ మాలిక్ గతంలో ఆరోపించారు. ఈ చర్యలతో బాలీవుడ్ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ ఓ ప్లానింగ్‌తో చేస్తున్న కుట్ర అని మాలిక్ అన్నారు.


Next Story