తప్పైంది.. పెద్ద మనసుతో క్షమించండి: గవర్నర్
Maharashtra governor koshyari apologises for remark after political row. దేశ వాణిజ్య రాజధాని ముంబై ఆర్థికపరిస్థితి ఉద్దేశించి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ
By అంజి Published on 2 Aug 2022 2:42 AM GMTదేశ వాణిజ్య రాజధాని ముంబై ఆర్థికపరిస్థితి ఉద్దేశించి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. ఈ క్రమంలోనే గవర్నర్ మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని కోరుతూ ట్విటర్ వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఓ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. ''గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచి వెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బులు మిగలవు. దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హతను ముంబై కోల్పోతుంది'' అని గవర్నర్ వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో.. పలు పార్టీలు ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. ''గవర్నర్ హిందువుల మధ్య విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు మరాఠీ ప్రజలను అవమానించడం కిందకే వస్తాయి. ఆయనను ఇంటికి పంపించే అంశంపై ప్రభుత్వం నిర్ణయించుకునే టైమ్ వచ్చింది. కోశ్యారీ కూర్చున్న స్థానాన్ని గౌరవించడం కోసం ఇంకా ఎంత కాలం మౌనంగా ఉండాలో అర్థం కావట్లేదు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ వెంటనే క్షమాపణ చెప్పాలి'' అంటూ ఉద్ధవ్ తీవ్రంగా స్పందించారు.
కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ఈ అంశంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా స్పందించారు. ఆ వ్యాఖ్యలు గవర్నర్ వ్యక్తిగతమని, వాటికి తాను మద్దతు ఇవ్వబోనని తెలిపారు. ఈ క్రమంలోనే కోశ్యారీ తాను చేసిన వ్యాఖ్యలకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర ప్రజలు పెద్దమనసు చేసుకొని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నా' అంటూ ప్రకటన విడుదల చేశారు. కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో తాను తప్పుగా మాట్లాడిఉండొచ్చని పేర్కొన్నారు.