మహారాష్ట్ర మాజీ సీఎం కన్నుమూత

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్నుమూశారు.

By Srikanth Gundamalla  Published on  23 Feb 2024 4:22 AM GMT
maharashtra, ex cm manohar joshi, death ,

మహారాష్ట్ర మాజీ సీఎం కన్నుమూత

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్నుమూశారు. ఆయనకు రెండ్రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దాంతో.. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ముంబైలోని పీడీ హిందుజా ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు తర్వాత ఆయన కొంత సమయం చికిత్స పొందారు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. అయితే.. శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

మనోహర్ జోషి గతేడాది మే నెలలో కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మెదడులో రక్తస్రావం అవ్వడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఇక అప్పటి నుంచి ఆయన వరుసగా అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. ఈసారి గుండెపోటు రావడం.. అది ఎక్కువగా ఉండటంతో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా.. శుక్రవారం మధ్యాహ్నం ముంబైలో మనోహర్ జోషి అంత్యక్రియలు జరగనున్నాయి.

మనోహర్ జోషి రాజకీయ ప్రస్థానం:

మనోహర్ జోషి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1937 డిసెంబర్‌ 2న నాంద్వీలో జోషి జన్మించారు. ఆయన ముంబైలో చదువుకున్నారు. ఆయన భార్య అనఘ మనోహర్‌ జోషి 2020లో కన్నుమూశారు. కాగా.. ఈయనకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తొలినాళ్లలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1967లో మనోహర్‌ జోషి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1968-70 మధ్య మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలిచారు. మున్సిపల్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా ఎంపిక అయ్యి సేవలందించారు. 1967-77 మధ్య కాలంలో ముంబై మేయర్‌గా మనోహర్ జోషి బాధ్యతలు నిర్వర్తించారు.

1972లో తొలిసారి మహారాష్ట్ర శాసన మండలికి సభ్యుడిగా ఎంపిక అయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశాక 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1990-91 మధ్యకాలంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున పోటీ చేసి ముంబై నార్త్‌సెంట్రల్‌ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అలా మనోహర్ జోషి శివసేన పార్టీలో అగ్రస్థాయి నేతగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదిగి 1995 నుంచి 1999 మధ్యకాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇక మాజీ ప్రధాని వాజ్‌పేయి హయంలో 2002-2004 కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా కూడా మనోహర్ జోషి పని చేశారు. మనోహర్ జోషి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Next Story